సెక్షన్ 498ఎ దుర్వినియోగం,రెండు వేర్వేరు కుటుంబాలు, సంప్రదాయాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులను దాంపత్యబంధంతో ఒకటిగా చేసినా, కొందరి విషయంలో కడ దాకా అది నిలుస్తుందని చెప్పలేం.

సెక్షన్ 498ఎ దుర్వినియోగం
============
రెండు వేర్వేరు కుటుంబాలు, సంప్రదాయాల నుంచి వచ్చిన ఇద్దరు
వ్యక్తులను దాంపత్యబంధంతో ఒకటిగా చేసినా, కొందరి విషయంలో కడ దాకా
అది నిలుస్తుందని చెప్పలేం.
వివాహ బంధంలో నీవు, నేను- అనే
అహంభావాన్ని వదిలి మనం, మన కుటుంబం- అని భార్యాభర్తలిద్దరూ
సర్దుకుపోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ వివాహం విజయవంతం అవుతుంది.
ఈ విజయంలో అబ్బాయి కుటుంబం, అమ్మాయి కుటుంబంలోని సభ్యులు కూడా ముఖ్యపాత్ర పోషిస్తారు. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు మొదలయ్యే చిన్న చిన్న
గొడవలు తీవ్రం కాకుండా చేయడం పెద్దల బాధ్యత. అది అన్నివేళలా సాధ్యం
కాకపోవచ్చు. భర్త, అత్తింటివారు
అమ్మాయిని బాధ పెడుతున్నారు, కట్నం చాలదంటూ హింసిస్తున్నారని తరచూ వింటుంటాం. గృహహింస, వరకట్న బాధితులైన స్ర్తిల కోసం భారత రాజ్యాంగంలో వరకట్న నిషేధ చట్టంలో సెక్షన్ 498ఎ ఏర్పాటు చేశారు. కట్నం కోసం వేధించే భర్త, అత్తింటివారి మీద బాధిత మహిళ ఈ సెక్షన్ ప్రకారం కేసు వేసి న్యాయ పోరాటం చేయవచ్చు.
కాగా, వివాహిత మహిళల భద్రత, రక్షణ కోసం ఏర్పాటుచేసిన ఈ చట్టం మరెంతో మంది అమాయక మహిళల, కుటుంబ సభ్యుల వేధింపులకు కూడా కారణమవుతోందన్న వాదనలు లేకపోలేదు. అందరు అత్తలూ మంచివారు కానట్టే అందరు కోడళ్లూ మంచివాళ్లు కారు. తమకు అనుకూలంగా లేనప్పుడు- భర్త, అత్తింటివారు, చివరికి ఎక్కడో దూరంగా ఉన్న ఆడపడుచులు కూడా తమను వేధిస్తున్నారంటూ కొం దరు కోడళ్లు ఈ చట్టం అండతో కేసుల్లో ఇరికిస్తున్న ఉదంతాలున్నాయ. ఒక్క ఉత్తరం ముక్కతో పోలీసులు కూడా న్యాయ విచారణ లాంటివేమీ లేకుండా తక్షణమే ఆ కంప్లెయింట్లో ఉన్న వాళ్లందరినీ అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. దానివల్ల ఏ పాపమూ తెలియని ఆ కుటుంబ సభ్యులు సమాజంలో తలెత్తుకోకుండా అవమానాల పాలవుతున్నారు. ఇక ఆ కేసు తేలేసరికి ఎన్నో ఏళ్లు పడుతుంది. ఖర్చు కూడా తక్కువేమీ కాదు. చివరికి కంప్లెయింట్ ఇచ్చిన మహిళ కోరినట్టుగా ఆస్తిపాస్తులు రాసి ఇచ్చి, రాజీ పడక తప్పడం లేదు. ఇలా అమాయకులైన వారిని తప్పుడు కేసులలో ఇరికించి బాధపెట్టడం అనేది ఈ మధ్య ఎక్కువగా వినపడుతోంది. పోలీసులు, న్యాయస్థానాలు కూడా కంప్లెయింట్ ఇచ్చిన మహిళ మాటలనే నమ్మాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఇటువంటి తప్పుడు కేసుల వల్ల తమ పరువు పోతోందని బాధితులు వాపోతున్నారు. వరకట్న నిషేధ చట్టం ఐపిసి 498ఎ కింద నమోదు చేసిన ఫిర్యాదుల్లో దాదాపు ఎనభై శాతం తప్పుడు కేసులే అంటున్నారు పరిశోధకులు. భర్తను, అత్తింటివారిని డబ్బుల కోసం అన్యాయంగా వేధించడం తప్ప ఇతరత్రా కారణాలేమీ ఉండడం లేదు. సుప్రీంకోర్టు కూడా దీనిని 'చట్టపరమైన ఉగ్రవాదం'- అని పేర్కొంది. డబ్బుకోసమో, వేరు కాపురం పెట్టడానికో, చిన్న చిన్న విషయాల్లో భర్తలతో గొడవకు దిగి సమన్వయలోపంతో విచక్షణ కోల్పోయి ముసలివారు, పేదవారు అని కూడా చూడకుండా అమాయకులైన అత్తామామల మీద, భర్తమీద ఈ సెక్షన్ కింద కేసులు పెట్టి ఇరికిస్తున్న కోడళ్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటివారిని వదిలించుకుందామన్నా వీలుకాని పరిస్థితి. అరెస్ట్ అయన తర్వాత విడుదలై వచ్చినా కేసు తేలేవరకు కోడలి బెదిరింపులు తప్పవు. కోడలు ఎప్పుడేం చేస్తుందో? అని అత్తింటివారు అనుక్షణం భయపడుతూ ఉండాలి. కాగా, ఇటీవల ఒక కేసు విషయమై ముంబై హైకోర్టు- ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి వేధించడం హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరత్వం కిందవస్తుందని తీర్పునిచ్చింది.
ముంబైకి చెందిన సంతోష్, రేఖ (పేర్లు మార్చాం) దంపతులు. వీరి మధ్య గొడవలు, మనస్పర్థలు పెరగడంతో రేఖ తన భర్తపై వరకట్నం వేధింపుల కేసు పెట్టి అతడిని, అతడి కుటుంబ సభ్యులను పోలీసులతో అరెస్టు చేయంచింది. సంతోష్ చెప్పిన వివరాల ప్రకారం- అతని భార్య చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని నమ్ముతూ కింది కోర్టు కేసు కొట్టేసింది. ఆ తర్వాత సంతోష్ తన భార్య నుండి విడాకులు కోరుతూ పూణేలోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అతడి వాదనను తోసిపుచ్చింది. చివరకు సంతోష్ ముంబై హైకోర్టులో అప్పీల్ చేయగా దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు, ఇతర ఆధారాలను పరిశీలించిన జస్టిస్ వి.ఎం.కనాడే, పి.డి.కొడేలతోకూడిన ధర్మాసనం, తప్పుడు కేసులు పెట్టి వేధించడం హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(1)(ఎ) ప్రకారం క్రూరత్వం కింద పరిగణించాల్సి వస్తుందని పూణే కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చి అతనికి విడాకులు మంజూరు చేసింది. ఇక భర్త, అత్తగారి వైపు బంధువులను వేధింపు కేసులతో సతాయించే కోడళ్ళకు ఇది ఒక హెచ్చరికగా ఉంటుందేమో! తప్పుడు కేసులు పెట్టడం- తప్పే కాదు, అది క్రూరత్వం అని న్యాయస్థానమే తీర్పునిచ్చింది.


--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం