వినాయక పూజా విధానం, వ్రత కథ

వినాయక పూజా విధానం & వ్రత కథ
వినాయక చవితి సందర్భంగా వినాయకుని పూజా విధానం, వ్రత కథ...మీ కోసం.
"వక్రతుండా మహాకాయ కోటి సూర్య సమప్రభా
నిర్విఘ్ణం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా"
గజాసుర వృత్తాంతం.

సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరోత్పత్తియును, చంద్రదర్శన దోషకారణంబును, తన్నివారణంబును చెప్పదొడంగెను.
పూర్వము గజరూపము గల రాక్షసేశ్వరుడు శివుని గూర్చి ఘోర తపంబొనర్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకొనుమనెను. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి " స్వామీ! నీవు ఎల్లప్పుడు నా యుదరమందే వసించి యుండుము " అని కోరెను. అంత భక్తసులభుండగు ఆ మహేశ్వరుండు ఆతని కోర్కె దీర్ప గజాసురుని యుదరమందు ప్రవేశించి సుఖంబుగ నుండెను.

ఇట్లుండ కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలుతెరంగుల నన్వేషించుచు కొంతకాలమునకు శివుడు గజాసుర గర్భస్తుండగుట దెలిసి రప్పించు మార్గంబు గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్ధించి తన పతివిషయము దెలిపి "ఓ మహానుభావా! పూర్వము భస్మాసురుని బారినుండి నాపతిని రక్షించి నా కొసగితివి. ఇప్పుడు కూడా నుపాయాంతరముచే రక్షింపు " మని విలపింప శ్రీహరి ఆమె నూరడించి పంపెను.
అంత నా శ్రీహరి బ్రహ్మాది దేవతల పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే యుక్తమని నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా నలంకరించి బ్రహ్మాది దేవతలందరిచే తలకొక వాద్యమును ధరింపజేసి , తానును చిరుగంటలు, సన్నాయి దాల్చి గజాసుర పురంబుజొచ్చి జగన్మోహనంబుగా నంది నాడించుచుండ గజాసురుండు పరమానందభరితుడై "మీకేమి కావలయునో కోరుకొం " డనిన, హరి వానిని గాంచి "ఇది శివుని వాహనమగు నంది. శివుని కనుగొనుటకు వచ్చె గాన శివునొసంగు " మని పల్కెను.

ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా నెరింగి తనకు మరణమే నిశ్చయమనుకొని తన గర్భమున గల శివుని " నా శిరము త్రిలోక పూజ్యముగా జేసి, నా చర్మము ధరింపు " మని ప్రార్ధించె. అంత విష్ణుమూర్తి ఆతని అంగీకారము తెలిసి నందిని ప్రేరేపించెను. నంది తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించెను. అంత మహేశ్వరుండు గజాసుర గర్భమునుండి వెలువడి శ్రీహరిని స్తుతించెను. అంత నాహరి " దుష్టులకిట్టి వరంబు లీయరాదు.ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లగు " నని యుపదేశించి బ్రహ్మాదిదేవతలను వీడ్కొలిపి తానును వైకుంఠమునకేగెను.శివుడు నంది నెక్కి కైలాసంబునకు జనియె.


వినాయకోత్పత్తి.
కైలాసంబున పార్వతీదేవి భర్తరాకను దేవాదులవలన విని ముదమంది అభ్యంగ స్నాన మాచరించుచు నలుగు పిండితో నొక బాలుని జేసి ప్రాణంబొసంగి సింహద్వారమున కాపుంచెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణముల నలంకరించుకొని పతిరాకకు నిరీక్షించుచుండెను.
అంత పరమేశ్వరుడు లోపలికి పోవు సమయమున సింహద్వారమున గల బాలుడడ్దుపడగా, శివుడు కోపించి త్రిశూలముచే నా బాలుని కంఠము దునిమి లోనికేగెను.
అంత పార్వతీదేవి పతిని గాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులచే పూజించి పరమానందమున ప్రియభాషణములు ముచ్చటించుచుండగా ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చెను. అంత శివుడు తానొనరించిన పనికి చింతించి తానుతెచ్చిన గజాసుర శిరంబు నా బాలునికతికించి ప్రాణంబొసంగి " గజాననుం " డని నామంబిడి పుత్రునిగా పెంచుకొనుచుండెను. గజాననుండును తల్లిదండ్రులను భక్తితో సేవించుచుండెను. అతడు అనింద్యుడను ఎలుకను వాహనముగా జేసికొని తిరుగుచుండెను.
కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించెను. అతడు మహాబలశాలి. నెమలి అతని వాహనము.
విఘ్నేశాధిపత్యము.
ఒకనాడు దేవతలును, మునులును, మానవులును పరమేశ్వరుని సేవించి " విఘ్నముల కొక్కని అధిపతిగా తమ కొసగు " మని కోరిరి. గజాననుడు తాను జ్యేష్టుడు గనుక ఆ యాధిపత్యము తన కొసగుమనగా, " గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్ధుడు గాన తనకే యొసగుమని " కుమారస్వామి తండ్రిని వేడుకొనెను.


అంత శివుడు వారల జూచి "మీలో ఎవ్వరు ముల్లోకములందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నావద్దకు వత్తురో వారికి ఈ ఆధిపత్యము వొసగుదు నని పలుక వల్లె యని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనమెక్కి వాయువేగంబున నేగెను. అంత గజాననుండు ఖిన్నుండై తండ్రిని సమీపించి ప్రణమిల్లి " అయ్యా! నా అసమర్ధత తా మెరింగియు ఇట్లానతీయ తగునే! మీపాద సేవకుడను. నా యందు కటాక్షించి తగు నుపాయము జెప్పు " మని ప్రార్ధించె.
అంత శివుడు దయతో 

"సకృన్ నారాయణే త్యుక్త్వా పుమాన్ కల్ప శతత్రయం ! గంగాది సర్వతీర్ధేషు స్నాతో భవతి పుత్రక !" 

అనగా 
"ఓ కుమారా ! ఒకసారి నారాయణ మంత్రమును జపించిన మూడు వందల కల్పంబు పుణ్యనదులలో స్నాన మొనర్చిన వాడగునని

యథావిధిగా నారాయణ మంత్రముపదేశించగా గజాననుడు అత్యంత భక్తితో తన్మత్రంబు పఠించుచు కైలాసంబున నుండెను. 

అమ్మంత్రప్రభావంబున గంగానదిలో స్నానమాడనేగిన కుమారస్వామికి తనకు పూర్వమే గజాననుండా నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు కన్పించసాగెను. అతండు మూడుకోట్ల ఏబది లక్షల నదులలో నటులనే చూచి ఆశ్చర్యమంది కైలాసమునకేగి తండ్రి సమీపముననున్న అన్నను గాంచి నమస్కరించి తన బలమును నిందించుకుని "తండ్రీ! అన్నగారి మహిమ తెలియక నట్లంటిని. క్షమింపుము. ఈ ఆధిపత్యము అన్నగారికే యొసంగు " మని శివుని ప్రార్ధించెను.

పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్ధినాడు గజాననునికి విఘ్నాధిపత్యం బొసంగబడియె.

ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునకు తమతమ విభవము కొలది కుడుములు, అపూపములు మున్నగు పిండివంటలు, టెంకాయలు పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుండై, కుడుములు మున్నగునవి భుజించి, కొన్ని తన వాహనమునకొసంగి, కొన్ని తనచేత ధరించి మందగమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబుజేరి తల్లిదండ్రులకు ప్రణామంబు చేయబోవ ఉదరము భూమికానగా, చేతులు భూమి కందవయ్యెను. బలవంతమున చేతులానినను చరణంబు లాకాశంబు జూచెను.

ఇట్లు దండప్రణామంబు చేయుటకు గణపతి కడు శ్రమనొందుచుండగా శివుని శిరంబున నున్న చంద్రుడు చూచి వికటంబుగ నవ్వెను. అంత రాజదృష్టి సోకిన రాళ్లుగూడ నుగ్గగునను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భము పగిలి అందున్న కుడుములు మొదలగునవి తత్ప్రదేశంబెల్లెడం దొరలిపోయెను.అతండును మృతుండయ్యెను.

అంత పార్వతి శోకించుచు చంద్రుని జూచి " పాపాత్ముడా ! నీ దృష్టి తగిలి నాకుమారుడు మరణించెను. కాన నిన్ను జూచిన వారు పాపాత్ములై నీలాపనిందల నొందుదురు గాక " యని శపించెను.

ఋషిపత్నులకు నీలాపనింద కలుగుట.

ఆ సమయమున సప్త మహర్షులు యజ్ఞము చేయుచు తమ భార్యలతో అగ్నిప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషి పత్నులను మోహించి, శాపభయమున అశక్తుడై క్షీణించుచుండెను. అయ్యది అగ్ని భార్య యగు స్వాహాదేవి గ్రహించి అరుంధతీ రూపము దక్క తక్కిన ఋషిపత్నుల రూపముతో పతికి ప్రియంబు చేసెను. ఋషులయ్యది గాంచి అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలే యని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతి ఇచ్చిన శాపానంతరము

ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరి కట్టి నీలాపనింద కలిగెను.

దేవతలును, మునులును ఋషిపత్నుల యాపద పరమేష్టికిన్ దెల్ప నాతండు సర్వజ్ఞుడగుటచే అగ్నిదేవుని భార్యయే ఋషిపత్నుల రూపమును దాల్చుట దెలిసికొని సప్తఋషుల సమాధాన పరచి వారితోగూడ తాను కైలాసమున కేతెంచి ఉమామహేశ్వరులను సేవించి మృతుండై పడివున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబు గూర్చెను.

అంత దేవాదులు "ఓ పార్వతీ, నీవొసంగిన శాపమున లోకములకెల్ల కీడు వాటిల్లె గావున దాని నుపసంహరించు" మని ప్రార్ధించిరి. పార్వతి సంతుష్టాంతరంగయై కుమారుని జేరదీసి ముద్దాడి "ఏ దినమున విఘ్నేశ్వరుని జూచి చంద్రుడు నవ్వెనో ఆ దినమున చంద్రుని చూడరాదు" అని శాపావకాశము నొసంగెను.

అంత బ్రహ్మాదులు సంతసించుచు తమ గృహముల కేగిరి. భాద్రపద శుద్ధ చతుర్ది యందు మాత్రము చంద్రుని జూడక జాగరూకులై సుఖంబుగా నుండిరి. ఇట్లు కొంతకాలము గడిచెను.


శమంతకోపాఖ్యానము.
శమంశమంతకోపాఖ్యానముతకోపాఖ్యానము
ద్వాపరయుగమున ద్వారకావాసి యగు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్తుతించి ప్రియ సంభాషణములు జరుపుచు "స్వామీ ! సాయం సమయమయ్యె. ఈనాడు వినాయక చతుర్ధి గాన పార్వతీ శాపముచే చంద్రుని చూడరాదు గాన నిజ గృహంబునకేగెద. సెలవిండు." అని పూర్వ వృత్తాంతము దెల్పి స్వర్గమున కేగెను.

అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని చూడరాదని పట్టణమున చాటించెను. నాటిరాత్రి కృష్ణుడు క్షీరప్రియుండగుటచే తాను మింటివంక చూడక గోష్ఠమునకు పోయి పాలు పిదుకుచూ పాలలో చంద్రుని ప్రతిబింబమును చూచి "ఆహా ! ఇక నాకెట్టి యపనింద రానున్నదో కదా " యని సంశయమున నుండెను.

కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్య వరముచే శమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణ దర్శనార్ధమై ద్వారకా పట్టణమునకు పోవ - శ్రీకృష్ణుడు అతనికి మర్యాదచేసి ఆ మణిని మన రాజునకిమ్మని అడిగిన, " అది ఎనిమిది బారువుల బంగారమును దినమున కొసగునట్టిది. దీని నేయాప్తున కే మందమతియైన నీయ " డనిన పోనిమ్మని కృష్ణుడూరకుండెను.

అంత నొకనాడు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుండా శమంతకమును కంఠమున ధరించి వేటాడ నడవికి జనగా నొక సింహమా మణిని మాంసఖండమనిభ్రమించి వానిని జంపి యామణిని గొనిపోవుచుండ - నొక భల్లూక మా సింగమును దునిమి మణిని గొని తన కొండబిలమున కేగి తనకుమార్తె యగు జాంబవతి కాటవస్తువుగా నొసగెను.

మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని "శ్రీకృష్ణుడు తనకు నేను మణినీయలేదని నా సోదరుని జంపి రత్నమపహరించె " నని పట్టణమున జాటెను. కృష్ణుడు అది విని నాడు క్షీరమున చంద్రబింబమును జూచిన దోషఫలమిది యని తలచి, దానిని బాపుకొన బంధుసమేతుడై యరణ్యమునకుంజని, వెదకగా, నొక్కచో ప్రసేనుని కళేబరంబును, సింగపు కాలి జాడలును, భల్లూక చరణ విన్యాసంబును గాన్పించెను. ఆ దారింబట్టి పోవుచుండ నొక పర్వత గుహద్వారంబు గని, పరివారము నచట విడిచి, తానొక్కడు లోపలికేగి అందు ఊయలకు కట్టబడియున్న మణిని తీసుకొని వచ్చుచుండగా, అదిగని, వింతమానిసి వచ్చెననుచు జాంబవతి కేకలు వేసెను.

అంత జాంబవంతుడు రోషావిష్టుండై చనుదెంచి శ్రీకృష్ణునిపై అరచుచు, నఖంబుల గ్రుచ్చుచు, కోరలం గొరుకుచు ఘోరముగా యుద్ధమొనర్ప, కృష్ణుండును వానిం బడద్రోసి వృక్షములతోను, రాళ్ళతోను తుదకు ముష్టిఘాతములతోను రాత్రింబగళ్ళు ఎడతెగక, యిరువదెనిమిది దినంబులు యుద్ధ మొనర్చెను.

క్రమముగా జాంబవంతుడు క్షీణబలుండై దేహంబెల్ల నొచ్చి, భీతిచెందుచూ, తన బలంబు హరింపజేసిన పురుషుని రావణసంహారియగు శ్రీరామచంద్రునిగా తలంచ,ి అంజలి ఘటించి " దేవాదిదేవా ! ఆర్తజనరక్ష ! నిన్ను త్రేతాయుగంబున రావణాది దుష్ట రాక్షస సంహరణార్ధమై అవతరించి, భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా నెరింగితిని. ఆ కాలంబున నాయందలి వాత్సల్యముచే వరంబు కోరుమన, నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వయుద్ధంబు జేయవలెనని కోరితి. కాలాంతరమున అది జరుగగలదని తాము సెలవిచ్చితిరి. అదిమొదలు మీ నామస్మరణము చేయుచు, అనేక యుగములు గడుపుచు నిచట నుండ నిపుడు నా నివాసమునకు దయచేసి నాకోరిక నెరవేర్చితివి. నా శరీరంబంతయు శిథిలమయ్యె. ప్రాణములు కడబట్టె. జీవితేఛ్ఛ నశించె. నా అపచారములు క్షమించి కాపాడుము. నీకన్న వేరు దిక్కులేదు." అనుచు భీతిచే పరిపరి విధముల ప్రార్ధించెను.

అంత శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీరమంతయు తన కరంబున నిమిరి " జాంబవంతా ! శమంతక మణి నపహరించినట్లు నాపై నారోపించిన అపనింద బాపుకొన నిటు వచ్చితిని గాన మణి నొసంగుము. నే నేగెద " నని దెల్ప అతండు శ్రీకృష్ణునకు మణిసహితముగా తన కుమారియగు జాంబవతిని కూడా కానుకగా నొసంగెను.
అంత తన ఆలశ్యమునకు పరితపించుచున్న బంధుమిత్ర, సైన్యములతో, కన్యారత్నముతో, మణితో శ్రీకృష్ణుడు పురంబు జేరి సత్రాజిత్తును రావించి పిన్న పెద్దలను చేర్చి జరిగినది విన్నవించి మణి నొసంగగా సత్రాజిత్తు "అయ్యో ! లేనిపోని నిందమోపి దోషంబునకు పాల్పడితి " నని విచారించి మణిసహితముగా తన కూతురగు సత్యభామ నతనికి భార్యగా సమర్పించి తన తప్పు క్షమింపు మని వేడుకొనెను.

శ్రీకృష్ణుడు సత్యభామను గొని మణి వలదని అది అతనికే ఒసంగెను.

శ్రీకృష్ణుడు ఒక శుభ ముహూర్తమున జాంబవతీ, సత్యభామలను పరిణయంబాడ నచటికి వచ్చిన దేవాదులు, మునులును స్తుతించి "మీరు సమర్ధులు గనుక నీలాపనింద బాపుకొంటిరి. మాకేమి గతి " యని ప్రార్ధించిన శ్రీకృష్ణుడు దయగలవాడై "భాద్రపద శుద్ధ చతుర్ధి యందు ప్రమాదవశమున చంద్రదర్శనమయ్యెనేని, ఆ నాడు గణపతిని యథావిధి పూజించి శమంతకమణి కథను విని పూజితాక్షతలు శిరంబున దాల్చువారు నీలాపనిందలు పొందకుండెదరుగాక " అని ఆనతీయగా దేవాదులు సంతసించి తమతమ నివాసంబుల కరిగిరి.

ప్రతి సంవత్సరమును భాద్రపద శుద్ధ చతుర్ధి యందు దేవతులు, మహర్షులు, మానవులు మున్నగువారందరు తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్టసిద్ధి గాంచుచు సుఖంబుగ నుండిరని శాపమోక్షప్రకారంబు శౌనకాది మునులకు వినిపించి సూత మహాముని వారిని వీడ్కొని నిజాశ్రమంబున కరిగెను.

సర్వేజనాః సుఖినోభవంతు. 
(Please click on the link)


వినాయక వ్రతకల్పం


ఈ పుస్తకాన్ని ఉచిత దిగుమతి చేసుకోడానికి ఇక్కడ నొక్కండి.
శ్రీ నందన నామ సంవత్సర వినాయక చవితి (2012) సందర్భంగా భక్తిప్రపత్తులతో కినిగె అందిస్తోంది - "వినాయక వ్రతకల్పం పుస్తకం" ఉచిత కానుక. ఇది సరళ వచనంలో చెప్పబడిన క్రియారూపక పూజావిధానం.
ఇందులో పూజాసామాగ్రి వివరాలు, శ్లోకాలు, వివరణ, దండకం, మంగళహారతులు, వ్రత కథ మొదలైనవన్నీ నిర్దిష్ట పద్ధతిలో చెప్పబడ్డాయి. మొదటిసారిగా పూజ చేసుకునే వారు సైతం ఏ ఇబ్బంది లేకుండా పూజ చేసుకునేలా చెప్పబడ్డాయి.


భారతీయులం” |.:: bharatiyulam.blogspot.in ::. | "Facebook"

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం