ఐకమత్యం అనగానే ముందు చీమలే గుర్తుకొస్తాయి. వాటి గొప్పతనం అలాంటివి.ఒకే పుట్టలో కొద్దీ కలిసి ఉండడమే కాదు. వాటి పని అవి క్రమం తప్పక చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి

చీమ
ఐకమత్యం అనగానే ముందు చీమలే గుర్తుకొస్తాయి. వాటి గొప్పతనం అలాంటివి.ఒకే పుట్టలో కొద్దీ కలిసి ఉండడమే కాదు. వాటి పని అవి క్రమం తప్పక చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి కూడా. చీమలు పుట్టుకొచ్చింది కందిరీగల నుంచే అంటే నమ్ముతారా? ఇవి సుమారు 10 కోట్ల ఏళ్ళ కిందట కందిరీగలతో విడిపోయి, ప్రత్యేక జీవులుగా రూపొందాయి. సుమారు 11,880 జాతులుగా ఉన్న వీటిల్లో ఇటీవల కొత్తరకం చీమను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అన్నట్టు.. ప్రపంచంలో మొత్తం చీమలను కలిపితే వాటి బరువు, మనుషుల బరువు కన్నా ఎక్కువ ఉంటుంది తెలుసా! 

మనలాగా చీమలకు ఊపిరితిత్తులు, గుండె లేవు. రక్తానికి రంగు కుడా ఉండదు. అయినా, తమ కన్నా 20 రెట్ల బరువునైనా ఇట్టే మోస్తాయి. ఇది మనం 1000 కిలోల బరువు మోయడంతో సమానం మరి. శరీరం పై కవచానికి ఉండే సన్నని రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. బయటకు కనబడేవి రెండు కళ్ళే అయినా, వాటిల్లోనే చిన్నచిన్న కళ్ళు బోలెడన్ని కలిసి ఉంటాయి! ఈగలకు ఉన్నట్టుగా అన్నమాట. తల మీద అటూ ఇటూ కదిలే కొమ్ముల్లాంటి అంటెన్నాలతో, తాము విడుదల చేసే రసాయనాల వాసనను పసిగట్టి మాట్లాడేసుకుంటాయి. ఇక చీమల కోరలు బలం అంతా ఇంతా కాదు.

భలే ఇళ్ళు!
ఇళ్ళు. అదే పుట్టలను కట్టుకోవడంలో చీమల తెలివి అంతా ఇంతా కాదు. వాసలు కురిసినా పడిపోకుండాఆ గోడలు బలంగా ఉండేందుకు మట్టి, ఇసుకల్లో పుల్లలను కలిపేస్తాయి. లోపల ఎన్ని అరలు ఉంటాయో! ఒకో అవసరానికి ఒకో అర. కొన్నింటిలో ఆహారం దాచుకుంటే.. మరికొన్నింటిలో పిల్లల పెంపకం. ఇంకొన్ని గదుల విశ్రాంతి కోసం. అయితే, అన్ని గదులను కలిపేలా దారులు ఏర్పాటు చేసుకోవడం మాత్రం మరచిపోవు. కొన్నిరకాల చీమలు చెట్ల కాండంలో ఇళ్ళను ఏర్పాటుచేసుకుంటాయి కూడా.

చిత్రమైన పద్ధతులు!
కలిసికట్టుగా జీవించడంలో, పనులను విభజించుకోవడంలో చీమలను మించినవి లేవు. ఒకో పుట్టలో 80 లక్షల దాకా నివసిస్తాయి. రాణి చీమలు, శ్రామిక చీమలు, సైనిక చీమలు, కాపలా చీమలు. ఇలా వేటి పని వాటిదే. రెక్కలు ఉండే రాణి చీమ గుడ్లు పెట్టడంతప్ప మరేపని చేయదు. మగ చీమలు రాణి చీమలతో జత కలిశాక వెంటనే చనిపోతాయి. పాపం ఇక రాణి గారికి సేవలు చేసేవేమో శ్రామిక చీమలు. ఇవి రాణి చీమ శరీరం నుంచి వచ్చే రసాయనాన్ని రుచి చూసి, దాని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటాయి. గుడ్లను కాపాడడం, అవి లార్వా దశ నుంచి పిల్లలుగా మారి పెద్దయ్యే వరకు కనిపెట్టుకొని ఉంటాయి. పుట్టను కాపాడే పని సైనిక చీమలది. శత్రువులు దాడి చేశారని తెలియగానే కాపలా చీమలు ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. వాటిని పసిగట్టగానే సైనిక చీమలు ఒక్క పెట్టున దాడికి దిగుతాయి.

సమాచార విప్లవం!
చీమల మాటలను ఒక రకంగా రసాయనిక భాష అనుకోవచ్చు. ఎందుకంటే.. ఏ విషయాన్ని అయినా తమలోంచి వచ్చే ' పెరోమోన్స్ ' ద్వారా తెలియజేస్తాయి. ఉదాహరణకు ఏ చీమకైనా ఆహారం కనబడిందనుకోండి. వెంటనే అది ' ఫెరోమోన్ 'ను దారి అంతటా విడుదల చేసుకుంటూ తమ ఇంటికి వస్తుంది. తిరిగి తన వారిని వెంటేసుకొని ఆ వాసనను బట్టి అక్కడికి చేరుకుంటుంది. ఇక చీమలు తమ స్థావరాన్ని ఎలా కనుక్కుంటాయో తెలుసా? దారిలో ఉన్న కొండ గుర్తులతో పాటు సూర్యుడి దిశను గుర్తుపెట్టుకొని! చీమలు ఇళ్ళు కట్టుకోవడం, కట్టుబాట్లు ఏర్పరచుకోవడం,వాటిని పాటించడం వంటివి చూస్తుంటే... అవెంత పద్ధతిగా జీవిస్తున్నాయో తెలియడం లేదూ! @ భారతీయులం  

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం