Telugu basha vayasentha ? తెలుగు భాష వయస్సెంత ? తమిళంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండీ సాహిత్యం లభిస్తోంది. క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ప్రత్యేక భాషగా ఏర్పడి ఉండవచ్చు.

"తెలుగు భాష వయస్సెంత?"
సురేష్ కొలిచాల "తెలుగు భాష వయస్సెంత?" అనే వ్యాసంలో తెలుగు భాష ఎంత పాతదో నిర్ణయించే ప్రయత్నం చేసారు !
తమిళంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండీ సాహిత్యం లభిస్తోంది. తమిళం లోనూ కన్నడలోనూ తాలవ్యీకరణ (palatalization) లో వ్యత్యాసం కనబడుతోంది కాబట్టి, అవి రెండు కనీసం మూడు నాలుగు వందల యేండ్ల ముందుగా విడివడి ఉండాలి. ఆ రకంగా పూర్వ-తమిళం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ప్రత్యేక భాషగా ఏర్పడి ఉండవచ్చు. కానీ దక్షిణ ద్రావిడ భాషలకూ, దక్షిణ-మధ్య ద్రావిడ భాషలకూ శబ్ద నిర్మాణంలోనూ, వాక్య నిర్మాణంలోనూ అనేక వ్యత్యాసాలు కనిపిస్తాయి. దక్షిణ ద్రావిడ భాషలైన తమిళ‌-కన్నడ లతో పోలిస్తే తెలుగు-కువి-గోండీ లలో కనిపించే వ్యత్యాసాలో కొన్ని--
1. వర్ణవ్యత్యయం (metathesis): తెలుగు-కువి-గోండి భాషలలో మూల ద్రావిడ ధాతువులోని అచ్చు తరువాతి హల్లు పరస్పరం స్థానం మార్చుకుంటాయి. (ఉదా: వాడు < *అవన్ఱు, వీడు <*ఇవన్ఱు, రోలు < ఒరళ్ <*ఉరళ్)
2. తెలుగులో బహువచన ప్రత్యయం- లు. తమిళాది దక్షిణ భాషల్లో ఇది -కళ్‌, -గళు.
3. క్త్వార్థక క్రియలు తమిళాదుల్లో -తు -ఇ చేరటం వల్ల ఏర్పడుతాయి. తెలుగు-కువి-గోండి భాషలలో -చి, -సి చేరటం వల్ల ఏర్పడుతాయి. ఉదా: వచ్చి, చేసి, తెచ్చి, నిలిచి వరుసగా తమిళంలో వన్దు , కెయ్దు, తన్దు, నిన్ఱు.
పైన పేర్కొన్న లక్షణాలన్నీ దక్షిణ మధ్య ద్రావిడ భాషలన్నిటిలో ఉండి దక్షిణ ద్రావిడ భాషలో లేనివి. అంటే ఈ మార్పులన్నీ తెలుగు-కువి-గోండి ఒకే భాషగా కలిసి ఉన్న రోజులలో మూల దక్షిణ ద్రావిడ భాషనుండి విడిపోయిన తరువాత వచ్చిన మార్పులన్న మాట. అన్ని ముఖ్యమైన మార్పులు రావటానికి కనీసం 400-500 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే తెలుగు-కువి-గోండి భాషలు దక్షిణ మధ్య ద్రావిడ ఉప శాఖగా క్రీస్తు పూర్వం 1100 సంవత్సరంలో మూల దక్షిణ ద్రావిడం నుండి విడిపోవచ్చు. ఇదే నిజమైతే క్రీస్తు పూర్వం 700-600 వరకే తెలుగు ఒక ప్రత్యేక భాషగా స్వయంప్రతిపత్తిని కలిగి ఉండవచ్చునని మనం ఊహించవచ్చు. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రహ్మణం ఆంధ్ర జాతిని ప్రత్యేక జాతిగా పేర్కొనడం ఈ లెక్కతో సరిపోతుంది కూడా!

ఈ రకమైన కాలనిర్ణయం సాపేక్ష కాలమానాల (relative chronology) మీద ఆధారపడ్డదే కానీ పద, ధాతు వ్యాప్తి గణాంకాల (lexicostatistics) మీద ఆధారపడ్డది కాదు. ద్రావిడ భాషల పూర్వచరిత్ర పై ఇంకా పరిశోధనలు ఇతోధికంగా జరిగితే గాని తెలుగు భాషా జనన కాలనిర్ణయాన్ని నిష్కర్షగా చెప్పలేం.@ భారతీయులం  

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం