videshallo vidyaa, udyogaalaku melukuvalu....విదేశాల్లో విద్య, ఉద్యోగాలకు మెలకువలు


    ఇంజినీరింగ్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశించేవారిలో , ఇప్పటికే చదువుతున్నవారిలో చాలామంది అభిలాష- విదేశాల్లో పీజీ చదవాలనీ, అక్కడే ఉద్యోగం సాధించి  స్థిరపడాలనీ! ప్రమాణాలు తీసికట్టుగా ఉంటున్న మన సగటు కళాశాలల్లో చదువుతున్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఏ మెలకువలు పాటించాలి? మార్గం ఎలా సుగమం చేసుకోవాలి ? ఇదిగో మార్గదర్శనం...

కోర్సులో ప్రవేశించిన దగ్గర్నుంచీ డిగ్రీ చేతికందేలోపు మూడు/నాలుగు సంవత్సరాల కాలం తక్కువేమీ కాదు. ఈ వ్యవధిని ఎంత ప్రయోజనకరంగా మల్చుకోగలం అన్నదానిపైనే కెరియర్‌, భావి జీవిత గమనం ఆధారపడివుంటాయి. ప్రవేశపరీక్ష వరకూ బాగా కష్టపడి చదివి కఠినమైన పోటీలో సీటు సంపాదించిన ప్రతిభావంతులైన విద్యార్థులే తర్వాత నిర్లక్ష్యధోరణితో ఫెయిలవుతున్న ఉదంతాలు ఐఐటీల్లో కూడా గమనించవచ్చు. ఈ పరిస్థితిలోకి జారిపోకుండా విద్యార్థులు జాగ్రత్త వహించాలి.


విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలంటే అర్హతలూ, నైపుణ్యాలూ మెరుగైన స్థాయిలో ఉండాల్సిందే కదా! వేరే దేశంలో భిన్న సంస్కృతుల నేపథ్యం ఉన్నవారితో కలిసి పనిచేస్తే అది వృత్తిపరమైన ఎదుగుదలకూ, వ్యక్తిగత వికాసానికీ కూడా ఉపయోగపడుతుంది. తాత్కాలికంగా కావొచ్చు; శాశ్వతంగా కావొచ్చు- విదేశాల్లో విధుల నిర్వహణ విశిష్ట అనుభవాన్ని సంపాదించిపెడుతుందని అక్కడ ఉద్యోగాల్లో కొనసాగుతున్న నిన్నటి ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఘంటాపథంగా చెపుతున్నారు.

విదేశాల్లో రాణించటానికి తోడ్పడే లక్షణాలేమిటి?

కమ్యూనికేషన్‌ సామర్థ్యాలు
మనది ఆంగ్లం మాతృభాషగా ఉన్న దేశం కాదు. మన నిత్యవ్యవహారాలన్నీ మాతృభాష సాయంతోనే సజావుగా నడిచిపోతుంటాయి. ఇంగ్లిష్‌ పరీక్షలో చాలామంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ మన విద్యార్థుల్లో చాలామంది ఆంగ్లభాషా వాగ్ధాటి చాలా తక్కువ. ఇంగ్లిష్‌ అంతర్జాతీయ భాష కాబట్టి మనం ఏ దేశం వెళ్ళాలన్నా ఈ భాషపై పట్టు ఉండటం అవసరం.

కళాశాల విద్య కోసమే కాదు, దైనందిన జీవితంలో కూడా దీని ఆవశ్యకత ఎక్కువని తెలిసిందే. కాబట్టి స్వదేశంలో విద్యాభ్యాసం పూర్తికాకముందే ఆంగ్ల భాషా వ్యక్తీకరణలో నైపుణ్యం పెంచుకోవటానికి కృషి చేయటం ముఖ్యం.

సబ్జెక్టు పరిజ్ఞానం, కోర్సులు
మనదేశంలోని విధానానికి భిన్నంగా విదేశాల్లో విద్యావ్యవస్థ ఉంటుంది. ఇక్కడ సిద్ధాంతపరమైన దృష్టి అధికం. కానీ విదేశాల్లో ప్రయోగ అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఈ లోపం సవరించుకునేందుకు అదనంగా మన విద్యార్థులు కృషి చేయాల్సిందే.

ప్రధానంగా కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ బ్రాంచిల విద్యార్థులు విదేశాల్లోని ఈ కోర్సుల స్థాయి అందుకోవటానికి తమ అవగాహన సామర్థ్యాలను పెంచుకోకతప్పదు. అదనపు కోర్సుల, లాంగ్వేజెస్‌ పరిజ్ఞానం సాధించగలిగితే ఎల్లప్పుడూ ఉపయోగమే. విదేశాల్లో ఈ కోర్సుల నిర్మాణం ఇక్కడి కోర్సుల మాదిరి ఉండదు. ఎక్కడ చదివినా ఈ కోర్సులకు సంబంధించిన అదనపు పరిజ్ఞానం మాత్రం పెంపొందించుకోవాలి.

సరైన కోర్సు ఎంపిక
తమ స్నేహితుల, కుటుంబసభ్యులిచ్చిన సమాచారం, సలహాలపై ఆధారపడే ఎక్కువమంది కోర్సు/ బ్రాంచిలను ఎంచుకుంటుంటారు. ఇది సరైన ఎంపిక కాకపోయే ప్రమాదముంది. దీనికంటే తన ఆసక్తి, అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయం తీసుకోవటానికి ప్రయత్నించటం మేలు.

చదవబోయే కోర్సులో ఏమేం నేర్చుకోవాల్సివుంటుంది, కళాశాల తీరు ఎలా ఉంటుందీ... ఇవన్నీ పూర్తిగా తెలుసుకుని చేరటం వల్ల తర్వాతకాలంలో ఇబ్బందులు తలెత్తవు. పూర్తిగా కోర్సుమీద మనసు కేంద్రీకృతం చేయగలుగుతారు.

కోర్సు అంశాలు తన అవగాహనకూ, ధోరణికీ సరిపోవని భావిస్తే ఇతర బ్రాంచిలను ఎంచుకోవచ్చు. ఎందుకంటే... ఇష్టమైన సబ్జెక్టులోనే ఏ విద్యార్థి అయినా విశేషంగా రాణించే అవకాశం ఉంటుంది. మెరుగైన కెరియర్‌కైనా, విదేశాలకు వెళ్ళటానికైనా ఇది పునాదిగా ఉపకరిస్తుంది.

విదేశాల్లో పరిస్థితులు
డిగ్రీ తర్వాత విదేశాల్లో కోర్సు/ఉద్యోగంలో ప్రవేశించదలిచినవారు తాము లక్ష్యంగా పెట్టుకున్న దేశంలోని పరిస్థితులను తెలుసుకోవాలి. వాతావరణ పరిస్థితులపై అవగాహన కూడా అవసరమే. చాలామంది విద్యార్థులు పరాయి దేశాలకు చేరుకున్నాక అక్కడి వాతావరణం సరిపడక వివిధ రుగ్మతలతో ఇబ్బందిపడుతుంటారు. చదువు/ విధినిర్వహణపై ఈ ప్రభావం తప్పకుండా పడుతుంది. ఈ సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం విస్మరించరానిది.

ఇతరదేశాల్లోని జీవన పరిస్థితులూ, వారి జీవన శైలి మనకంటే భిన్నంగా ఉంటుందని గుర్తించాలి. మనదేశంలో బయట కూడా బిగ్గరగా మాట్లాడుకుంటుంటాం కదా? చాలా దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో మౌనంగా ఉండటం సాధారణం. వీటిని గమనించి అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా తమను మల్చుకోవాలి. విద్యార్థులకు ఆ దేశంలో బంధువులూ, స్నేహితులూ ఉంటే సాపేక్షంగా కొంత ఉపయోగకరం.

ఇలాంటి అంశాలపై అవగాహన పెంచుకోవటం కష్టమేమీ కాదు. ఆపై విదేశాల్లో పీజీ చేసినా, కొలువులో చేరినా ఆ ప్రస్థానం సాఫీగా విజయవంతంగా మారుతుంది.

కీలక నైపుణ్యాలు ముఖ్యం 

విదేశీ విద్య, ఉద్యోగాలకు ఉపకరించే కొన్ని ప్రధాన నైపుణ్యాలపై విద్యార్థులు దృష్టిపెట్టటం మేలు. తాము ఎంచుకున్న రంగాన్ని బట్టి అవసరమైనవాటిని పెంపొందించుకోవటానికి ప్రయత్నించాలి.

భాష: స్పోకెన్‌, రిటన్‌ ఇంగ్లిష్‌లో చెప్పుకోదగ్గ ప్రావీణ్యం పెంచుకోవటం.

లేఖనం: బిజినెస్‌ లేఖలు, ఎజెండాలు, మినిట్స్‌ రాసే ప్రతిభను సానపెట్టుకోవటం.

కంప్యూటర్‌: వర్డ్‌ప్రాసెసింగ్‌, స్ప్రెడ్‌ షీట్లు, డేటాబేసెస్‌ ఉపయోగించటం, పవర్‌ పాయింట్‌, వెబ్‌ పరిశోధన.

నిర్వహణ:to-do lists తయారీ, ఎగ్జిక్యూటివ్‌ సమ్మరీ, ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్‌ ప్రణాళికలు

భావ వ్యక్తీకరణ: స్పష్టంగా, సమర్థంగా భావాలను తెలియజేసే నేర్పు, మార్కెటింగ్‌ వ్యూహాల పరిజ్ఞానం.


--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం