tallidandrulanna daivasannibuluraa ani elugetti chaatinavaare ! telusukondi

తల్లిదం డ్రులన్న దైవసన్నిభులు

తల్లిదండ్రులన్న దైవసన్నిభులురా అన్నది కవులు చెప్పినమాట. ప్రతీచోటా దేవుడు కనబడలేక అమ్మానాన్నలను అందించాడన్నది పెద్దలు చెప్పిన మాట. ఈ రెండు నిజమే! దేవుడు అభవుడు అని వేదాలు చెబుతున్నాయి. అంటే పుట్టుకే లేనివాడు అని అర్ధం. అలాంటి పుట్టుకలేనివాడు కూడా భూలోకానికి వచ్చి అమ్మానాన్నలను ఎంచుకుని మరీ పుడుతున్నాడు. వాళ్ల చల్లని ఒడిలో సేదతీరుతున్నాడు. ముద్దు, మురిపెం, అచ్చటా ముచ్చట తీర్చుకుంటున్నాడు. నా అన్నవాడు లేక మొహంవాచిపోయే దేవుడు తనకంటూ ఒక వర్గాన్ని సృష్టించుకోడానికి యుగానికొకసారి పుడుతున్నాడు. దశావతారాలలో మత్స, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలకు తల్లిదండ్రుల అవసరమే లేకుండా పోయింది. ఆ తరువాత వచ్చిన వామనుని అవతారం మనిషి అవతారానికి ప్రాథమిక రూపం. ఈ పొట్టి బాపడు పుట్టడానికి అమ్మానాన్నలు కావలసి వచ్చారు. అందుకు కశ్యప ప్రజాపతి, అదితి యోగ్యత సంపాదించారు. వారి కడుపున పుట్టిన బుడతకిశోరుడు వామనుడు. వచ్చిన పని చాలా చిన్నది కావడంతో ఆయనకు పెరిగి పెద్దయ్యేవరకు అమ్మానాన్నల దగ్గర ముద్దులు గునిసేంత సమయం లేకపోయింది. ఆ లోటు తీర్చుకోడానికేనా అన్నట్టు నారాయణుడు రాముని అవతారం ఎత్తాడు. కౌసల్యతో పెళ్ళయినా ఎప్పటికీ ప్లిలలు పుటలేదు. ముగ్గురు భార్యలున్నా సంతానలేమి ఆయనను వదలలేదు. వయసుమళ్ళిపోతున్న దశలో పుత్రకామేష్టి యాగం చేశాడు దశరథుడు.యజ్ఞసంభవుడిగా పుట్టిన రాముడిని ప్రాణాధికంగా పెంచుకున్నారు కౌసల్యా దశరథులు. ఒకేసారి దశరథుడికి నలుగురు పిల్లలు పుట్టినా రాముడంటే దశరథుడికి ఎంతో అభిమానం. అలా అని మిగిలిన పిల్లల మీద అభిమానం లేదని కాదు. అయ్యకు పెద్దపిల్లవాడిమీద, అమ్మకు చిన్న పిల్లవాడిమీద మమకారం చాలా సహజంగా ఉంటుందని పెద్దలు చెబుతారు. అదే నీతి దశరథుని విషయంలోనూ పనిచేసింది. రాముడు నాన్నచాటు పిల్లవాడు అనే పేరుంది. అందుకే ఆయనను దాశరథి అని పిలుస్తారు. కానీ విశ్వామిత్రుడు ఆయనను కౌసల్యసుప్రజారామా అని పిలిచాడు. అంటే కొసల్య కుమారా అని అర్ధం. అంటే రాముని ఆయన అమ్మచాటు పిల్లవాడిగా చూశాడు. ఇప్పటికీ మనం కౌసల్యాసుప్రజారామా అనే రాముడిని మేలుకొలుపుతున్నాం. ఈ రెండు కీర్తులను సమన్వయ పరచుకుంటే అర్థమయ్యేదేమిటి ఆయన అమ్మానాన్నలిద్దరికీ ప్రియమైన కుమారుడనేకదా రాముడు చిన్నపðడు ఆకాశంలో దగదగ మెరిసే చందమామ కావాలని ఏడిస్తే కౌసల్య దశరథుడు ఇద్దరూ కంగారు పడ్డారు. భూమ్మీద దొరికే అవకాశంలేని చందమామను తీసుకురమ్మంటే తెచ్చేది ఎలా పెద్దకొడుకు..కోరక కోరిన కోరిక అది. ఆ భావన ఇద్దరినీ గిలగిలలాడేలా చేసింది. రాముడు ఏడిస్తే భరించలేని వాళ్ళు ఆయనను ఎలాగైనా ఓదార్చేందుకు అద్దం తెచ్చి అందులో ప్రతిబింబం చూపించి రాముడితో ఏడుపు మానిపించారు. అక్కడితో హమ్మయ్య అనుకున్నారు. విశ్వామిత్రుడు రాముడిని అడవికి పంపమన్నపðడు ఇద్దరి గుండెలు అదిరాయి. అయితే విశ్వామిత్రుని గురుత్వంలో రాముడు బాణవిద్యలో ఆరితేరి దివ్యాస్త్ర సంపన్నుడయ్యాడని, రాక్షసలోకాన్ని నాశనం చేశాడని తెలిసి బ్రహ్మానంద పడ్డారు. అలాగే తమకంటికి ఇంకా చిన్నపిల్లవాడే అనిపించిన రాముడు శివుడి విల్లు విరిచి సీతను చేపట్టి జగదభిరాముడయ్యాడని తెలిసి వారి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. రాముడికి రాజ్యాన్ని అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకున్న దశరథుని కోరిక కైకేయి వల్ల వమ్మవడం దశరథుడు తట్టుకోలేకపోయాడు. రాముడి వియోగం భరించలేక గుండెలు బద్దలైన దశరథుడు కన్నుమూశాడు. తండ్రిని కోల్పోయిన రాముడు పరమభక్తితో శ్రాద్ధకర్మలు నిర్వహించి మానవజాతికి తల్లిదండ్రుల రుణం తీర్చుకునే పద్ధతిని, మర్యాదను, నాగరికతను నేర్పాడు. అందుకే రాముడు మర్యాదాపురుషోత్తముడయ్యాడు.

రాముని భార్యగా విఖ్యాతి గడించిన సీత తండ్రిచాటు బిడ్డ. అందుకే ఆమెకు జానకి అనే పేరు వచ్చింది. అమ్మ రత్నమాల అంటే గౌరవం ఉన్నా ఆడపిల్లలు సహజంగా తండ్రినీడనే కోరుకుంటారు. సీత కూడా అదే చేసింది.

ఇదే రామాయణంలో తల్లిదండ్రులను కావడిలో పెట్టుకుని తీర్థయాత్రలు చేయిస్తూ అమ్మానాన్నల రుణం తీర్చుకున్న శ్రవణకుమారుడు కనిపిస్తాడు. అమ్మానాన్నల కోసం మంచినీటిని తీసుకురావడానికి చెరువుకు వెళ్ళిన శ్రవణకుమారుడు ముంత ముంచుతున్న చపðడు విని అదేదో అడవిజంతువు అనుకుని దశరథుడు బాణం వేస్తాడు. అది తగిలి అమ్మా అని కేకపెడతాడు. ఆ కేక విన్నవెంటనే దశరథుడికి ముచ్చెమటలు పోస్తాయి. తన బాణాహతికి ప్రాణం కడగట్టిన శ్రవణకుమారుడిని చూసి బ్రహ్మహత్య చేశానే అని పరితపించిపోతాడు. ఆ కుమారుడి కోరిక మేరకు మంచినీటి ముంతను తీసుకుని శ్రవణుని తల్లిదండ్రులకు అందిస్తాడు. వచ్చిన వాడు తమ పిల్లవాడు కాదని ఆయన అలికిడి ద్వారా గ్రహించిన ఆ ముసలి దంపతులు దశరథుడి ద్వారా జరిగిన విషయం తెలిసి పెను దుఃఖంతో ప్రాణాలు విడుస్తారు. అమ్మానాన్నలకు పిల్లలకు ఉండే బంధం అంత సున్నితమైంది.

ఇదే రామాయణంలో పరశురాముడు కనబడతాడు. తండ్రి జమదగ్ని గొప్ప తపశ్శాలి. తల్లి రేణుక పరమపతివ్రత. ఇసుకతో కుండచేసి పచ్చి ఆరకుండానే నీళ్ళు తేగలిగిన మాహాత్మ్యం ఆమెది. ఒకరోజున ఆమె నీళ్ళు తేవడానికి వెళ్తే ఇసుక కుండ నిలువలేదు. నీళ్ళు తేవడానికి కుదరలేదు. ఆమె మనసులో అన్య చింతన వచ్చి మనసు మలిన పడిందని ఆమెకు మరణశిక్ష విధించాడు జమదగ్ని. దాన్ని అమలుచేయాలంటూ కొడుకులను ఆదేశించాడు. కానీ కొడుకులు అమ్మను చంపేందుకు ఒపðకోలేదు. అది తన ఆజ్ఞాధిక్కారమేనని జమదగ్ని వారినందరినీ భస్మం చేసి పారేశాడు. చిన్న కొడుకు పరశురాముడు తండ్రి మాటను నిరాకరించలేక, అమ్మను దూరం చేసుకోలేక ఒక్క క్షణం సతమతమయ్యాడు. సృష్టికి ప్రతిసృష్టి చేయగల శక్తి గల తండ్రిమాట తలదాల్చి తల్లిని నరికేశాడు. జమదగ్ని శాంతించి వరం కోరుకోమన్నాడు. అడిగిందే తడవుగా అమ్మ ప్రాణాలు కావాలన్నాడు పరశురాముడు. ఆ విధంగా అమ్మానాన్నలను మెప్పించడమే కాదు రాముడికన్నా ముందుగా పితృవాక్యపరిపాలకుడన్న పేరు పొందాడు. విష్ణువు ధరించిన దశావతారాలలో ఒకడిగా పూజలందు కున్నాడు.

ఆ తరువాత ప్రజలలో బాగా పేరుపడిన వాడు శ్రీకృష్ణుడు. పుట్టింది దేవకీ వసుదేవులకు. పెరిగింది యశోదానందుల వద్ద. ఈ విధంగా కృష్ణుడు ఇద్దరు అమ్మానాన్నల మద్దుల కొడుకయ్యాడు. నిజానికి దేవకికి గర్భశోకమే తప్ప పిల్లవాడిని గట్టిగా కన్నారా చూసిందేలేదు. అర్థరాత్రివేళ రహస్యంగా జైలు దాటించి యమునానదిని దాటి గోపల్లెకు చేర్చే అతి కీలకమైన కార్యభారాన్ని గుండెలు గుప్పిట్లో పెట్టుకుని నిర్వహించిన వాడు వసుదేవుడు. జైలు తలుపులు దాటగానే గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు గట్టిగా ఓండ్రపెట్టాడు. రహస్యం ఎక్కడ బట్టబయలవుతుందో అని వసుదేవుడు కొడుకు కోసం గాడిద కాళ్లు గడ్డం పట్టుకుని బతిమాలుకున్నాడు. అందుకే వసుదేవుడంతటివాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడనే సామెత వచ్చింది. కృష్ణుడు గోకులానికి చేరిన దగ్గర్నుంచి ఆయనను కాపాడవలసిన బాధ్యత యశోదానందులపైన పడింది. పసికందులు కంటపడితే నరికేయాలన్న కంస హింసాత్మక చట్టం చాలా బలంగా అమలవుతున్న రోజులవి. పైగా యశోద ఉండే గోకులంపై ప్రత్యేకంగా కన్నువేసి ఉంచాడు కంసుడు. ఆ పరిస్థితిలో కృష్ణుడిని కాపాడడం బ్రహ్మప్రళయంతో సమానం. పైగా కృష్ణుడు మామూలుగా పెరిగాడా ఎప్పటికపðడు ఎక్కడికక్కడ మాయలుచేస్తూ మంత్రాలు చేస్తూ లీలామానుష విగ్రహుడిగా వార్తలకెక్కుతూ తన ఉనికిని చాటుకుంటూ ఉండేవాడు. కృష్ణుడు లీల చేసిన ప్రతీసారి యశోద గుండెల్లో రాళ్ళు పడేవి. బలరాముడు ఎంత నియంత్రించినా కృష్ణుడు ఆగేవాడు కాడు. మట్టితినే కృష్ణుని మందలించడమేకాదు పితూరీలు చెప్పే ఇరుగుపొరుగు వారికి అక్షింతలు వేయడం వరకు యశోద చేసిన పనులు ఇన్నీ అన్నీ కావు. తన పనులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా తన చల్లని నవ్వుతో యశోదను మాయచేసేవాడు. వాడు చేసే పనులు కలయో వైష్ణవమాయయో అనిపించేవి. అలా కంటికి రెప్పకన్నా ఎక్కువగా కాపాడుకుంటే కృష్ణుడు పెద్దవాడై రాచనగరుకు వెళ్ళి కంసుని చంపాక అక్కడే ఉండిపోయాడు. ఎనిమిది వివాహాలు చేసుకున్నా ఒక్క పెళ్ళికీ యశోదను పిలవలేదు. సంక్లిష్టమైన బాల్యాన్నంతా యశోదమీదికి నెట్టి వైభోగాలకు నెలవైన ప్రాయాన్ని దేవకీ వసుదేవులకు ఇచ్చాడు. యశోదానందులు పెద్ద కృష్ణుడి ఎడబాటుతో కుమిలిపోతే, చిలిపి కృష్ణుని చిన్నారి చేష్టలు చూసే భాగ్యానికి దేవకీవసుదేవులు దూరమయ్యారు. ఇద్దరూ అలా కొంత ఆనందాన్ని, కొంత బాధను పొందినవారే! అయినా శ్రీకృష్ణుడు యశోదాకృష్ణుడిగా, నందనందనుడిగా, వాసుదేవుడిగా, దేవకీపరమానందంగా వాసికెక్కాడు. అమ్మానాన్నలందరికీ సమానస్థాయిలో న్యాయం చేసిన శ్రీకృష్ణుడు అమ్మానాన్నల కూచిగానే మిగిలిపోయాడు.

భారతంలో విషాదకరమైన బాధను అనుభవించిన వాడు కర్ణుడు. దివ్యుడైన తండ్రి సూర్యభగవానుడు సహజ కవచకుండలాలు కలిగిన తన కుమారుడిని వంచించి వాటిని కాజేసేందుకు ఇంద్రుడు వస్తున్నాడని తెలిసి ముందస్తు హెచ్చరిక చేసి కన్నతండ్రిలోని కడుపుతీపి ఆరాటం ఎంతటిదో నిరూపించాడు. కుంతి ప్రాయంలో ఉన్నపðడు ఏ దేవుడినైనా పిలిచి ఆయన ద్వారా సంతానాన్ని పొందే వరం ఇచ్చాడు. దాన్ని పరీక్షించాలనే చాపల్యంతో కుంతి సూర్యభగవానుని పిలిచింది. ఫలితంగా కర్ణుడు జన్మించాడు. కన్నెగా ఉండి బిడ్డతల్లి అయిందంటే లోకం ఆడిపోసుకుంటుందన్న భయంతో ఆ వరప్రసాదిని గంగపాలు చేసింది. అమ్మగా కళంకాన్ని మూటకట్టుకున్నా వివాహానంతరం పుట్టిన బిడ్డలను జాగ్రత్తగా కాపాడుకుంది. తన సవతి మాద్రి కొడుకులు నకుల, సహదేవులను తన బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుని అమ్మలేని లోటు రానీయకుండా కాపాడు కొచ్చింది.

దుర్యోధనుడు ఎంతటి అధార్మికుడని పేరు పొందినా అమ్మానాన్నల మీద ఈగ వాలనీయకుండా కాపాడాడు. కంఠంలో ప్రాణమున్నంత వరకు తన తోడ పుట్టిన వారికి రక్షాకవచంలా, కొండంత అండగా ఉన్నాడు. ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశ్యపుడు పెట్టే రాక్షస పరీక్షలను సహనంతో భరించినా తల్లిదండ్రుల క్షేమాన్నే చివరిదాకా కోరుకున్నాడు. పరమవిధేయుడన్న పేరు తెచ్చుకున్నాడు.

ఇలా మహానుభావులు అయిన వారందరూ అమ్మానాన్నల మన్ననలు పొందినవారే! తల్లిదండ్రులన్న దైవసన్నిభులురా అని లోకానికి ఎలుగెత్తి చాటినవారే! వారి అడుగుజాడలే మనకూ ఆదర్శం కావాలి. మనమూ బుద్ధిమంతులమనే పేరు తెచ్చుకోవాలి.--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం