sabarimala ayyappa vivaraalu konni, deeksha mariyu paadayatra


శబరిమల

శబరిమల లేదా శబరిమలై, కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళ లోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు మరియు 18 కొండల మద్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండల పూజ(నవంబర్ 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14 వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శన మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మళయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచియుంచుతారు.

అయ్యప్ప దీక్ష

ఈ యాత్రను చేయదలచిన వారు అత్యంత శ్రద్ధా భక్తులతో కొన్ని కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది. మండల పూజకు హాజరయ్యే వారు తప్పని సరిగా 41 రోజుల పాటు దీక్ష చేపట్టాలి. సాధారణంగా ఈయాత్రలు స్వాములు ఒక గురుస్వామి (ఎక్కువ సార్లు దీక్ష చేపట్టిన స్వామి) నాయకత్వంలో ఒక బృందంగా బయలు దేరి వెళతారు. ప్రతి ఒక్కరూ తమ తలపై ఇరుముడి కెట్టు (గుడ్డతో చుట్టిన పూజా సామాగ్రి) ఉంచుకుని యాత్ర చేయాల్సి ఉంటుంది..



శబరిమలై యాత్ర

దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమలై యాత్ర చేస్తారు. ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది.

ఎరుమేలి
శబరిమలై యాత్ర "ఎరుమేలి"తో మొదలవుతుంది. ఎరుమేలిలో "వావరు స్వామి"ని భక్తులు దర్శించుకొంటారు. (అయ్యప్ప పులిపాలకోసం అడవికి వెళ్ళినపుడు అతనిని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే వావరు స్వామి. "నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకొంటారు" అని అయ్యప్ప వావరుకు వరమిచ్చాడట. ఈ వావరు స్వామి ఒక ముస్లిం కులస్తుడు. ఈ వావరు ఇక్కడ కొలువున్నది కూడా ఒక మసీదులోనే) దర్శనానంతరం భక్తులు వావరుస్వామి చుట్టూ రకరకాల వేషధారణతో "పేటై తులాల" అనే నాట్యం చేస్తారు. (మహిషితో యుద్ధం చేసేటపుడు అయ్యప్ప చేసిన తాండవం పేరు "పేటై తులాల"). ఈ ఎరుమేలి వద్ద ఉన్న "ధర్మశాస్త" ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్బాణధారియై ఉంటాడు. ఇక్కడ వినాయకుడుకూడా కొలువై ఉంటాడు. ఈయనను "కన్నెమూల గణపతి" అని అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు.

పాదయాత్ర
ఇక్కడినుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది. పాదయాత్రకు రెండు మార్గాలున్నాయి. "పెద్ద పాదం" అనేది కొండలమధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట. ఇది ఎనభై కిలోమీటర్ల దారి. దారిలో పెరుర్‌తోడు, కాలైకట్టి అనే స్థలాలున్నాయి. (మహిషితో అయ్యప్పస్వామి యుద్ధం చేస్తుండగా కాలైకట్టివద్దనుండి శివకేశవులు యుద్ధాన్ని చూశారట). ఇక్కడికి కొద్ది దూరంలోనే అళదా నది (మహిషి కార్చిన కన్నీరు నదీరూపమైందట) ఉంది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు నదినుండి ఒక రాయిని తీసుకు వెళతారు. ఆ రాతిని "కళిద ముకుంద" (మహిషి కళేబరాన్ని పూడ్చిన చోటు) వద్ద పడవేస్తారు. తరువాత యాత్ర ముందుకు సాగి పెరియానపట్టమ్, చెరియానపట్టమ్ అనే స్థలాలగుండా పంబ నది చేరుకొంటుంది. అక్కడే "పంబ" అనే గ్రామం కూడా ఉంది. ఇక్కడినుండి స్వామి సన్నిధానానికి ఏడు కిలోమీటర్ల దూరం.

చిన్నపాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి. బస్సులపై పంబానది వరకు చేరుకోవచ్చు. చివరి ఏడు కిలోమీటర్లు మాత్రం కాళినడకన వెళ్ళాలి.

సన్నిధానం

భక్తులు పంబానదిలో స్నానం చేసి "ఇరుముడి"ని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోషతో "నీలిమలై" అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు. కన్నెస్వాములు (తొలిసారి దీక్ష తీసుకొన్నవారు) తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో "శరమ్ గుత్తి" అనే చోట ఉంచుతారు. ఇక్కడినుండి అయ్యప్ప సన్నిధానంకు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది.
సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను "పదునెట్టాంబడి" అంటారు. 40 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని కధనం. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి, 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు. ఈ ఆళయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మ్రోగించారట.

సన్నిధానంలో "పానవట్టం"పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. స్వామియే శరణం అయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని. ఒంపు తిరిగిన ఎడమచేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు.

భారతీయులం” |.:: bharatiyulam.blogspot.in ::. | "Facebook| "Twitter"

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం