Civil's samaraaniki vibinna astraalu...సివిల్స్‌ సమరానికి విభిన్న అస్త్రాలు !






సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీలోని మొదటి పేపర్‌ పోటీపరీక్షలన్నిటిలోనూ సాధారణంగా కనపడేదే. ఈ సర్వీసుకు తగిన అభిరుచి అభ్యర్థుల్లో ఎంతమేరకు ఉన్నదో పరీక్షించేది రెండో పేపర్‌. ప్రిలిమినరీ విజయసాధనలో ఈ పేపర్‌ పాత్ర కీలకంగా మారింది. ఈ పేపర్‌ స్వభావం, తీరులను విశ్లేషిద్దాం!


విభిన్న పరిస్థితుల్లో అభ్యర్థుల ప్రతిభా సామర్థ్యాలను అంచనా వేసే రెండో పేపర్‌కు పకడ్బందీగా సిద్ధమవటం తప్పనిసరి. లేకపోతే మంచి స్కోరు సాధ్యం కాదు. ఏడు రకాల విభాగాలుండే ఈ పేపర్‌లో మొత్తం ప్రశ్నలు 80. ప్రతి సరైన జవాబుకూ రెండున్నర మార్కులు.

ఒక్కో విభాగాన్ని ఏ లక్ష్యంతో ప్రవేశపెట్టారో, సంసిద్ధమెలా అవాలో పరిశీలిద్దాం. 

కాంప్రహెన్షన్‌ 

పాలనలో భాగస్వామిగా ఉండే అధికారి తన విధులు సక్రమంగా నిర్వర్తించాలంటే అవగాహన శక్తి ముఖ్యం. ఒక నిర్దిష్ట పరిస్థితిలోని ముఖ్యాంశాలను గుర్తించి విశ్లేషించగల సత్తా, తగిన నిర్థారణకు వచ్చే విజ్ఞతా ఉండాలి. నివేదికలూ, సమాచారం పరిశీలిస్తూనే కార్యాచరణకు ప్రణాళిక రూపొందించుకోవాలి.

రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ విభాగం ఈ నైపుణ్యాలను పరీక్షిస్తుంది. అభ్యర్థులకు 2-3 పేరాగ్రాఫులు ఇచ్చి బహుళైచ్ఛిక (మల్టిపుల్‌ చాయిస్‌) ప్రశ్నలకు జవాబులు రాయమంటారు.

ఇంటర్‌ పర్సనల్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌
పాలనాధికారుల విధుల్లో భావ ప్రసారానికి (కమ్యూనికేషన్‌) ప్రాముఖ్యం ఉంది. బృందంలో పనిచేయటం పెరిగిన ప్రస్తుత కాలంలో ఈ నైపుణ్యాలు పెంచుకుంటేనే విజయానికి దగ్గరవుతాము. ఉద్యోగుల్లో నిబద్ధత, పని సామర్థ్యం మెరుగుపరచటానికి సమర్థమైన భావప్రసారం చేయగలగాలి. ఆత్మవిశ్వాసం, సంబంధాల మెరుగుదల, ఇతరులకు ఆమోదయోగ్యమవటం... ఇవన్నీ సమర్థ కమ్యూనికేషన్‌ వల్లనే సాధ్యం. సివిల్‌ సర్వెంటుకు ఇది చాలా కీలకం.

ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పరం జరిగే భావాల ప్రసారాన్నే ఇంటర్‌ పర్సనల్‌ నైపుణ్యాలంటారు. భిన్న పరిస్థితుల్లో రకరకాల వ్యక్తులతో తగిన విధంగా వ్యవహరించి ప్రజలు నిశ్చింతగా ఉండేలా చేయగలగాలి. ఆలకించటం, మాట్లాడటం, ఘర్షణను నివారించటం- ఇవి ఈ నైపుణ్యాలతో సాధించే సాధారణ ఫలితాలు.

ఈ విభాగంలో ప్రశ్నలకు నెగిటివ్‌ మార్కింగ్‌ ఉండదు.
ఉదా:1. How would you best console a bereaved person? 

a) Do not talk about the dead person for fear of causing pain. b) Give him a sedative on a regular basis after consulting a doctor. c) Instead of speaking give him a sympathetic touch. d) Offer help with the practical tasks and be prepared to listen. (Answer)  

లాజికల్‌ రీజనింగ్‌, ఎనలిటికల్‌ ఎబిలిటీ
ఆలోచనల పనితీరుపై ఆధారపడి మనుషులను మూడు రకాలుగా వర్గీకరించొచ్చు. 1) సరిగా, పొందికగా ఆలోచించలేనివారు 2) లోకజ్ఞానం, అనుభవం, తెలివితేటలు ఉపయోగించి నెగ్గుకువచ్చేవారు 3) దృఢంగా, తార్కికంగా ఆలోచించి ఇతరులకంటే శక్తిమంతంగా నిర్వహణ చేయగలిగేవారు. ఈ మూడో లక్షణమున్నవారే పాలనాధికారులుగా నేటి అవసరం.

ఈ నైపుణ్యాలను పరీక్షించేలాగానే ప్రశ్నలుంటాయి.

ఉదా:All big dams involve displacement of people and risk of serious harm to the ecology of the region. The claims of pro-big dam enthusiast cannot be sustained in terms of costs and benefits. 

Assuming the truth of the passage, one can conclude from it that :

a) No big dam should ever be constructed whatever be the benefits arising out of it. b) All big dams from the very nature of its 'highness'destroy ecology or displace people. c) Big dam should only be undertaken provided it displaces the minimum number of people causes negligible damage to ecology and provide substantial benefits when completed. (Answer ) d) There are abundant alternatives to each water in scarcity areas such a way that , what big dams can offer, the alternatives can provide more efficiently at lesser cost. 

డెసిషన్‌ మేకింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌
ప్రైవేటురంగంలోని ఉద్యోగి తీసుకునే నిర్ణయం కంటే సివిల్‌ సర్వెంట్‌ తీసుకునే నిర్ణయాలు ఎక్కువమంది ప్రజలపై ప్రభావం చూపిస్తాయి. పరిస్థితుల మంచి చెడులను బేరీజు వేసి, సత్వర నిర్ణయాలు తీసుకోగలగాలి. వీరు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజలకు ఉపయోగపడాలి. ఇలాంటివారిని గుర్తించటం సివిల్స్‌ నియామకాల లక్ష్యం.

డెసిషన్‌ మేకింగ్‌కు సన్నిహితంగా అనుసంధానమైవుండేది ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌. సివిల్‌ సర్వెంట్లందరూ ఈ నైపుణ్యాలనుపెంపొందించుకునివుండాలి. సమస్యను దాని ఆనుపానులు గ్రహించి, అందులో భాగమైవున్నవారి సహకారంతో పరిష్కరించాలి.

పరీక్షలో ఊహాత్మక సందర్భాలను ఇచ్చి ఈ నైపుణ్యాలను పరిశీలిస్తారు. అత్యుత్తమ నిర్ణయాన్ని ఎంచుకుని, సమాధానంగా గుర్తించాల్సివుంటుంది. నెగిటివ్‌ మార్కులుండవు.

ఉదా:1. You are having dinner with your colleagues. Suddenly one of your colleagues starts choking. What would be your first reaction? 

a) Reach for his throat around the voice box with your thumb and forefinger. b) Ask him 'are you choking' and see if he is able to reply. (Answer ) c) Ask him to leave the dining area immediately and go to the rest room. d) Try to help him cough so that the obstruction is cleared. 

జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ
అందుబాటులో ఉన్న గణాంక సమాచారం ఆధారంగా పాలనాధికారులు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. డేటా విశ్లేషణ ఆధారంగా సరైన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించాల్సివుంటుంది.

ఈ విభాగంలో ప్రశ్నలు గ్రాఫులు, డయాగ్రమ్‌లు, సంకేతాలతో నిండివుంటాయి. యూపీఎస్‌సీ ప్రకారం మెంటల్‌ ఎబిలిటీ అనేది ఇంటలెక్చువల్‌ ఎబిలిటీ అని గ్రహించాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌
సివిల్‌ సర్వెంట్లకు 'ఫంక్షనల్‌ ఇంగ్లిష్‌' పరిజ్ఞానం తగినంత అవసరమని అందరూ అంగీకరిస్తారు. అభ్యర్థి ఆంగ్ల భాషా నైపుణ్యాలను ఈ విభాగం పరీక్షిస్తుంది. కొన్ని పేరాలు ఇచ్చి మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు రాయమని అడుగుతారు. దీనికి సంబంధించి అభ్యాసాలకు పనికొచ్చే మెటీరియల్‌ విస్తృతంగానే లభ్యమవుతోంది.

పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించి, తగిన వ్యూహం తయారుచేసుకోవాలి. దాన్ని దీక్షగా అమలుచేయాలి. 


-  గోపాలకృష్ణ (డైరెక్టర్ , బ్రెయిన్ ట్రీ)  

--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం