aadapilla pudutundantene gundello vanuku...ela penchali, ela chadivinchali, katnaalu...antu.

ఆడపిల్ల పుడుతుందంటే గుండెల్లో వణుకు. ఆడపిల్లను పెంచలేమని, చదివించలేమనీ, కట్నాలుపోసి పెళ్లి చేయలేమనీ, జాగ్రత్తగా కాపాడలేమనీ ఇలా ఆడబిడ్డను పురిట్లోనే హతమార్చడానికి ఎన్నో కారణాలు. స్త్రీని దేవతగా, ఆకాశంలో సగభాగంగా కొలిచే నేటి భారతంలోనే ఈ ఘాతుకాలు జరగడం సిగ్గుపడాల్సిన విషయం. అతివ అడుగు ముందుకేస్తున్న కొద్దీ అణిచివేయడం గర్హించదగిన అంశం.

ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులకు అత్యాచారాలపై మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిపోయింది. ఒక పక్క దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వాటిని ఎలా నివారించాలో అలోచించలేక 'ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు' అంతా ఒకే మాట.

అమ్మాయిలకు స్వేచ్ఛ ఎక్కువ అవటం వలననే అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అని స్వయాన పశ్చిమబెంగాల్‌ మహిళ ముఖ్యమంత్రి మమతబెనర్జీ అనటం సిగ్గుచేటు. అధికార పార్టీ ప్రతినిధి రేణుకాచౌదరి అత్యాచారాలు శాంతి భద్రతల సమస్య కాదని అన్నారు. హర్యానా ముఖ్యమంత్రి అయితే ఏకంగా 16సం||లకే అమ్మాయిలకు పెళ్ళి చేయడం వలన అత్యాచారాలను నియంత్రించవచ్చని బాల్యవివాహాలను ప్రోత్సహించే విధంగా మాట్లాడారు. వీటిని బట్టి అమ్మాయిలపై రాజకీయ నాయకులలో ఎలాంటి దృక్పథం ఉందో అర్ధం చేసుకోవచ్చు.

పశ్చిమబెంగాల్‌, హర్యానాలలో ఒక్క నెలలోనే 30 కేసులకు పైగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2011లో అమ్మాయిలతో అనైతిక వ్యాపారం ఎక్కువగా జరుగుతుందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. మన రాష్ట్ర పోలీస్‌ లెక్కలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఇటీవల భారత ప్రభుత్వం చిల్డ్రన్స్‌ ఇన్‌ ఇండియా 2012 నివేదికను విడుదల చేసింది. దీనిలో దేశంలో అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలను (పోలీస్‌ స్టేషన్‌లో నమోదయిన కేసులు మాత్రమే) నివేదించారు. ఈ నివేదికలో ఇవి కొన్ని అంశాలు మాత్రమే..

మైనర్‌ బాలికలపై జరుగుతున్న అకృత్యాలలో ఎ.పిలో అధికం

* అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలలో అత్యధికంగా 605 కేసులు నమోదు కాగా అనైతికంగా అమ్మాయిలతో వ్యాపారం చేయించే కేసులు 497 అత్యధికంగా కేసులు ఉండటం ఆంధ్రప్రదేశ్‌లో అమ్మాయిలకు భద్రత ఏ విధంగా ఉందో అర్ధమవుతుంది.

* మైనర్‌ బాలికలను బంధించడం కేసులలో 27% పెరిగాయి. వీటిలో పశ్చిమ బెంగాల్‌ (298)లో 34.6%తో అగ్రస్ధానంలో ఉంది. తర్వాతి స్ధానాల్లో బీహర్‌(183), అస్సాం(142), ఆంధ్రప్రదేశ్‌్‌(106) ఉన్నాయి.

* బాల్యవివాహాలలో దేశం మొత్తం మీద 113 కేసులు నమోదు కాగా అధికంగా పశ్చిమబెంగాల్‌ (25) తర్వాతి స్ధానాల్లో మహారాష్ట్ర(19), ఆంధ్రప్రదేశ్‌(15), గుజరాత్‌(13), కర్ణాటక(12) ఉన్నవి.

పశ్చిమబెంగాల్‌లో అధికారం మారిన తర్వాత అమ్మాయిలపై అకృత్యాలు బాగా పెరిగాయి. మహిళ ముఖ్యమంత్రి అయినా ఆమ్మాయిలపై నేరాలు పెరిగాయే కాని తగ్గలేదు. అయినా ఆమ్మాయిలదే నేరం అన్నట్లు ముఖ్యమంత్రి మాట్లాడటం శోచనీయం.

* వ్యభిచార వత్తిలో దింపేందుకు అడపిల్లలను కొనడం, అమ్మడం నేటికీ పలు రాష్ట్రాల్లో యధేచ్ఛగా కొనసాగుతోంది. 2010 సం||తో పోల్చితే 2011లో వ్యభిచార వృత్తిలోకి దింపేందుకు అమ్మాయిలను కొనడం 65%, అమ్మడం 13% పెరిగింది.

* ఈ తరహా నేరాల్లో అడపిల్లలను కొనడంలో అధికంగా మహారాష్ట్రలో 74% కేసులు నమోదయ్యాయి. అడపిల్లలను అమ్మడంలో అధికంగా పశ్చిమబెంగాల్‌లో 77% కేసులు నమోదయ్యాయి.

>అత్యాచార కేసులలో...

* 2010-11 అత్యాచార కేసులు 30%, అమ్మాయిలను బంధించడం 27% కేసులు పెరిగాయి. 2011 సం|| బాలికలపై అత్యాచారాలలో ముందు స్ధానంలో మధ్యప్రదేశ్‌ తర్వాతి స్ధానాల్లో ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాలలోనే 44.5% కేసులు నమోదయ్యాయి.

భ్రూణహత్యలలో...

* ఆడపిల్ల పుడుతుందని తెలిసి భ్రూణహత్యలకు పాల్పడుతున్న కేసులు కూడా పెరిగాయి. దేశం మొత్తం మీద 132 కేసులు నమోదు కాగా అధికంగా మధ్యప్రదేశ్‌లో నమోదవ్వగా, చత్తీస్‌గడ్‌, పంజాబ్‌ ఆ తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి.ఈ మూడు రాష్ట్రాల్లోనే 56% కేసులు నమోదయ్యాయి.నమోదయిన కేసులలో న్యాయస్ధానాలకు వెళ్ళి శిక్షలు పడుతున్నవి అతి తక్కువగా ఉంది.

శిక్ష విధించడంలో అలసత్వం

* పిల్లలపై నేరాలు పెరుగుతున్నప్పటికి వాటిపై కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం కనబడుతుంది. నమోదైన కేసులలో శిక్షలు పడిన వారు తక్కువే. కేవలం 34.6% కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నవి.

* చిన్నారుల హత్యలకు 45.5%, భ్రూణహత్యలకు 46.9% కేసుల్లో శిక్షలు పడినట్లు నివేదికలో పొందుపరిచారు. అమ్మాయిల క్రయవిక్రయాలలో 65% కేసులు నమోదయ్యాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 20.4% కేసులు 2011సం||లో నమోదయ్యాయి.122.2% కేసులు అమ్మాయిల ఎగుమతులపై నమోదు కాగా వాటిలో 56% కేసులు మధ్యప్రదేశ్‌లో నమోదవడం విశేషం.

* కేసులు నమోదుచేసి వాటిపై చార్జీషీటు నమోదు చేయడంలో మాత్రం వెనుకడుగే. 2011 సం||లో 82.5% కేసులకు మాత్రమే చార్జీషీటు నమోదు చేశారు. అతి తక్కువగా భ్రూణహత్యలపై నమోదు కావటం శోచనీయం.

...పై వివరాలను బట్టి దేశంలో అమ్మాయిలకు ఎలాంటి భద్రత ఉందో అర్ధం అవుతుంది. అందుకే మొట్టమొదటి సారిగా యునెస్కో, యు.ఎన్‌.ఓ ప్రపంచ బాలికల దినోత్సవాన్ని జరపాలని డిసెంబర్‌ 2011న నిర్ణయించాయి. అక్టోబర్‌ 11న ఈ దినోత్సవాన్ని జరపాలని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ వెడుకను అన్ని దేశాలు ఏదోఒక రూపంలో జరుపుకున్నాయి. భారతదేశంలో కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకొన్నారు. యునెస్కో భారతదేశానికి బాల్యవివాహాలను రద్దుచేయడానికి పూనుకోవాలని సందేశం పంపింది. ఇదే అక్టోబర్‌ 11న హర్యానా ముఖ్యమంత్రి 16 యేళ్ళలోపే బాలికలకు వివాహాలు చేయాలని ప్రకటించారు. హర్యానాలోని పంచాయితీ పెద్దలు కూడా బాల్య వివాహాలను జరపడం వలననే అమ్మాయిలపై అత్యాచారాలను అరికట్టగలమని ప్రకటించాయి.ఈ రాష్ట్రంలో ఒక్క నెలలోనే 15 అత్యాచార కేసులు నమోదయ్యాయి అంటే పరిస్ధితి అదుపు తప్పుతుందని అర్ధం అవుతుంది.. మన ఆంధ్రప్రదేశ్‌ బాల్యవివాహాలలో మూడవ స్ధానంలో ఉంది. జనాభాలో అమ్మాయిల శాతం తగ్గటం వలన ఇలాంటి అకృత్యాలు పెరుగుతున్నాయని ఐద్వావంటి మహిళా సంఘాలు చెబుతున్నా భూృణహత్యలను అరికట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది.

సమాజంలో అమ్మాయిలపై ఉన్న దృక్పథంలో మార్పు రావాలి. అధునిక కాలంలో ఆమ్మాయిలు మేము సైతం అని అన్ని రంగాలలో అభివృద్ధి అవుతున్న దశలో ఇలాంటి చేష్టలు తిరోగమనానికి ఆనవాళ్లు. కాబట్టి మన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. పెచ్చరిల్లుతున్న ఈ విషసంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకత నేడు ఆసన్నమైనది.


--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం