mudellu aina chekkuchedarani mruthadeham - మూడేళ్లయినా చెక్కుచెదరని మృతదేహం

మూడేళ్లయినా చెక్కుచెదరని మృతదేహం

బ్రహ్మంగారిమఠం, మార్చి 10 : కాలజ్ఞాన కర్త శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి అయిన కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో గురువారం ఓ వింత జరిగింది. సాధువుగా జీవనం సాగిస్తూ మూడేళ్ల క్రితం చనిపోయిన వెంకటయ్య మృతదేహం సమాధిలో మూడేళ్ల తర్వాత కూడా చెక్కు చెదరలేదు. ఆయన నిర్మించిన ఆశ్రమంలోనే మూడేళ్ల క్రితం సమాధి చేశారు. ఆయన చనిపోయిన తర్వాత బంధువులు ఆశ్రమాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆశ్రమాన్ని కూలదోస్తూ ఎక్స్‌కవేటర్‌తో చదరం చేస్తున్నపుడు గురువారం సాధువు వెంకటయ్య మృతదేహం సమాధి నుంచి బయటపడింది.

మృతదేహాన్ని బద్వేలు ప్రాంతానికి బంధువులు తరలిస్తుండగా గమనించిన నర్సన్నపల్లె గ్రామస్థులు ఆశ్రమాన్ని కూల్చివేసిన వారికి దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకు అప్పచెప్పారు. మూడేళ్లయినా మృతదేహం చెక్కు చెదరకుండా ఉండడంతో స్థానిక ప్రజలు పూజలు నిర్వహించడం మొదలు పెట్టారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో ప్రజలు భారీగా సంఘటనా స్థలానికి తరలి వచ్చి వెంకటయ్య మృతదేహాన్ని చూసి పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దారు సాయినాథ్ , బి.మఠం ఎస్ఐ రామచంద్రయ్య గ్రామస్తులతో చర్చించి సాధువు వెంకటయ్య మృతదేహాన్ని యధా స్థానంలోనే మళ్లీ సమాధి చేశారు.


--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం